ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు జరగనున్నాయి అనే దానికి సంకేతాలే ఇవి అంటున్నారు.

(విధాత ప్రత్యేకం)

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నర్సాపూర్‌, పటాన్‌చెరు, జహీరాబాద్‌, దుబ్బాక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కొంతకాలం కిందట కలవడంపై రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనికంటే ముందు ఓ మీడియా చానల్‌లో మీ ప్రభుత్వానికి స్వల్ప మెజారిటీనే ఉన్నది కదా ఓ ఐదారుగురు జంప్‌ అయితే ప్రభుత్వ మనుగడ పరిస్థితి అంతేకదా అన్న ప్రశ్నకు సీఎం రేవంత్‌ ధీటుగానే బదులిచ్చారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే గతంలో కొంతమంది ముఖ్యమంత్రులకు ఏం జరిగిందో తెలిసిందే. అలాంటి పరిస్థితే వస్తే ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అన్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా సీఎంతో భేటీ అయ్యారు. అయితే విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలువడంపై దానికి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని, మా నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే ముఖ్యమంత్రితో చర్చించినట్టు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా సీఎంతో కలిస్తే తప్పేమిటి? గతంలో తామిద్దరం టీడీపీలో కలిసి పనిచేశాం. మా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం సీఎం కలిసి చర్చిస్తాను అన్నారు. ఇదే సమయంలోనే మాజీ సీఎం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రతిపక్షంగా బలమైన వాదన వినిపిద్దామని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు సీఎంను కలువడంపై స్పందిస్తూ మీరు మంచి ఉద్దేశంతోనే ఆ పని చేసినా బైటికి వేరే విధంగా వెళ్తున్నదని కనుక కాంగ్రెస్‌ ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు.

వాళ్ల వెనుక ఉన్నది ఎవరు?

అయితే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో నంబర్‌ గేమ్‌ ప్రారంభమయ్యిందా? ఆట మొదలైందా? అంటే ఔననే వాదన వినిపిస్తున్నది. రెండు పార్టీలు అప్రమత్తంగానే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలక నేత పది, పదిహేను మందితో బలప్రదర్శన చేయనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అధికారపార్టీలో కొంతమంది కేసీఆర్‌ కోవర్టులున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే ఒకవేళ నంబర్‌ గేమ్‌ అటు వైపు మొదలైతే మనమూ అదే పనిచేద్దామనే ఆలోచనలో అధికారపార్టీ ఉన్నట్టు సమాచారం. గతంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి యత్నించినప్పుడు కొంతమంది విపక్ష ఎమ్మెల్యేలను రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్‌ పార్టీ ఫిరాయించేలా చేశారు. నాడు నీవు నేర్పిన విద్యనే మీము అనుసరిస్తామన్నట్టు అధికారపక్షం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అందుకే విపక్ష పార్టీలోని కీలక నేతను లైన్‌లో పెట్టారని అంటున్నారు. సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యేల వెనుక ఆయనే ఉన్నారా? అంటే అయి ఉండొచ్చు అంటున్నారు.

బీజేపీలో ఏం జరుగుతోంది?

ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఆయన లక్ష్యం నెరవేరకపోగా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఫలితాల తర్వాత ఈటల రాజేందర్‌కు బీజేపీలో ప్రాధాన్యం మరింత తగ్గినట్టు ఆయన ఇటీవల ఓ ఛానల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మరో పార్టీలోకి వెళ్లవద్దు నా అనుభవం ఇదే చెబుతున్నదని అన్నారు. ‘ఇరవై ఏళ్లు ఆ పార్టీలో ఉన్నాను. నా స్థాయి, నా స్థానం, నా గౌరవం అంతా ఉండేది. నా బంధం, నా అనుబంధం అంతా ఆ పార్టీలో ఉండేది. నేను అప్పటి పరిస్థితుల కారణంగా పార్టీ మారాను. మనం పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే గౌరవం, అక్కడ ఉండే స్థానం దక్కాలంటే అది సాధ్యమయ్యే పనికాదు’ అన్నారు. మొత్తంగా ఆయన పార్టీ మారి తప్పుచేశానని పరోక్షంగా అంగీకరించినట్టు ఆ ఇంటర్వ్యూలో ఆయన మాటలను బట్టి అర్థమవుతున్నది. రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో ఎమ్మెల్యేల జంపింగ్‌ అంశం చర్చ జరుగుతున్న సమయంలోనే బీజేపీ లో ముసలం మొదలైనట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు జరగనున్నాయి అనే దానికి సంకేతాలే ఇవి అంటున్నారు.

TAAZ

TAAZ

Next Story