100 సీట్ల గెలుపే లక్ష్యం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- ఎల్లపల్లి నుంచి ప్రచారం ప్రారంభం
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్‌కు శ్రీరామ రక్ష అని, అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్ల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
స్వగ్రామమైన నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో దుర్గామాత మండపం, అంజనేయ స్వామి ఆలయాల్లో పూజల అనంతరం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. కుమ్రం భీం, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి సోపానాలని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని, బీఆర్ఎస్ హ్యట్రిక్ విజయం ఖాయమన్నారు.
గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగామని పేర్కొన్నారు. నిర్మల్ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.