కేంద్ర బ‌డ్జెట్ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఒరిగింది ఏమీ లేద‌ని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ విమ‌ర్శించారు

  • కేంద్ర బ‌డ్జెట్ పై జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

Lakshmi Narayana | విధాత, విజ‌య‌వాడ: అర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఒరిగింది ఏమీ లేద‌ని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ విమ‌ర్శించారు. విభ‌జ‌న వ‌ల్ల గాయ‌ప‌డిన ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి, ఈ బ‌డ్జెట్ వ‌ల్ల ఒన‌గూరింది ఏమీ లేద‌న్నారు. స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్ళు గ‌డిచినా, ఇంకా బీద‌రికంపై స్కీములు పెట్టే స్థాయిలో మ‌న కేంద్ర బ‌డ్జెట్ ఉంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

జ‌న్ ధ‌న్ అకౌంట్ల‌లో 34 ల‌క్ష‌ల కోట్లు వేశామని కేంద్ర మంత్రి చెపుతున్నార‌ని, అలా డ‌బ్బు వేస్తే, స్వ‌యం స‌మృద్ధి, ఉపాధి ల‌భించిన‌ట్లా? అభివృద్ధి జ‌రిగిన‌ట్లా? అని ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌శ్నించారు. ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ బిల్డ్ ఇన్ రికార్డు టైమ్...అని కేంద్ర మంత్రి ప్ర‌స్తావించార‌ని, ఇక్క‌డ ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంద‌నే విష‌యం మ‌రిచార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

జై భార‌త్ మేనిఫెస్టోని ప్ర‌తిబింబించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ లో కొన్ని అంశాలు, జై భారత్ పార్టీ మ్యానిఫెస్టో ప్ర‌స్తుత బ‌డ్జెట్లో కొంత ప్ర‌తిబింబించింద‌ని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ పేర్కొన్నారు. త‌మ‌ మ్యానిఫెస్టో పొందుప‌రిచిన ప‌లు అంశాల‌ను కేంద్ర బ‌డ్జెట్లో ప్ర‌స్తావించ‌డాన్ని ఆయ‌న స్వాగ‌తించారు. సోలార్ ఎన‌ర్జీ, రూఫ్ టాప్ ప్లాన్ లో భాగంగా, 300 యూనిట ఫ్రీ ఎల‌క్ట్రిసిటీ వ‌చ్చేలా , కోటి ఇళ్ల‌కు రూఫ్ టాప్ సోలార్ ఇస్తామ‌ని చెప్ప‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టోలో టూరిజం అభివృద్ధికి ఆరు ర‌కాల ప‌థ‌కాల‌ను సూచించామ‌ని చెప్పారు.

కుల మతాల‌కు అతీతంగా ఆధ్యాత్మ టూరిజం, క‌ల్చ‌ర‌ల్ ఎకో, హెల్త్, మెడిక‌ల్, సినిమా, అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్, కోస్ట‌ల్ టూరిజం అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. తీర ప్రాంతంలో కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం, విశాఖ‌, నెల్లూరు టు అండ‌మాన్ క్రూయిజ్ లు కూడా ప్ర‌తిపాదించామని ల‌క్ష్మీనారాయ‌ణ పేర్కొన్నారు. అలాగే, కేంద్రం ప్ర‌తిపాదించిన స్టార్ట్ అప్ ల‌కు జైభార‌త్ కూడా పెద్ద పీట వేసింద‌ని, బ‌డ్జెట్లో టెక్నాల‌జీ స‌న్ రైజ్ ఇన్నోవేష‌న్ అని ప‌దేళ్ళ త‌ర్వాత ఇపుడు ఫోక‌స్ చేయడం మంచిదే అన్నారు. చెత్త నుంచి విద్యుత్, ఎరువులు బ‌యో మాస్ కూడా ప్ర‌స్తావించ‌డం త‌మ మ్యానిఫెస్టో ని ప్ర‌తిబింబించిన‌ట్లు భావిస్తున్నామ‌ని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు.

Updated On 1 Feb 2024 1:00 PM GMT
Somu

Somu

Next Story