Site icon vidhaatha

BRS Attack On Maha TV Office: మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి

విధాత, హైదారాబాద్ : ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. మహాన్యూస్ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ను, స్టూడియోను ధ్వంసం చేశారు. ఆఫీసుకు లోపలికి ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం చేశారు. గంటకు పైగా దాడి జరుగుతున్నప్పటికి పోలీసులు అక్కడికి చేరుకుని నిలువరించకపోవడం పట్ల మహాన్యూస్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికి మహా న్యూస్ యాజమాన్యం తమపై దాడికి పాల్పడిందని..అందుకే మా కార్యకర్తలు ప్రతిస్పందించారని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు.

అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాపై బురద చల్లితే చట్టపర చర్యలు తప్పవని..ఇకపై చూస్తు ఊరుకోబోమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించిన కొద్ధి సేపటికే మహాన్యూస్ ఆఫీస్ పై దాడి జరుగడం గమనార్హం. దీంతో ఈ దాడి కేటీఆర్ ప్రోద్బలం వల్లే జరిగిందని ఆరోపణలు చోటుచేసుకున్నాయి.

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు : కేటీఆర్

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని..అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మహాన్యూస్ పై దాడి ఘటన అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అనుంగ మిత్రులు అని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Exit mobile version