బాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే: సీఎం జగన్‌

అసెంబీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబుకు నమ్మి ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు

  • Publish Date - May 3, 2024 / 04:01 PM IST

  • వైసీపీ గెలిస్తేనే పథకాలన్ని మీ ఇంటికే
  • నర్సాపురం..పెదకూరపాడు ప్రచార సభల్లో ఏపీ సీఎం జగన్‌

విధాత : అసెంబీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబుకు నమ్మి ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నర్సాపురం, పెదకూరపాడు వైసీపీ ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రసంగించారు. ఈ ఎన్నికలు కులాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, ఓ క్లాస్ వార్ అని అభివర్ణించారు. ఈ 59 నెలల పరిపాలన కాలంలో ప్రతి రంగంలో విప్లవం సృష్టించామని, 2లక్షల 70వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను మీ బిడ్డ మీకు అందించారని తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి కార్పోరేట్ విద్యను సైతం అందుబాటులోకి తెచ్చామన్నారు. మీ బిడ్డ జగన్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు ఎప్పుడైనా అమలు చేశారా చూశారా అని ప్రశ్నించారు.
ప్రతి వర్గాన్నీ ఆర్థికంగా ఆదుకున్నాం, తోడుగా ఉన్నాం, ప్రోత్సహించామన్నారు.

గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని, జగన్ ఇచ్చిన స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమైనా చేశారా? అని ఫ్రశ్నించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని, మీ ఇంటికి మీ గడపకే వస్తాయని చెప్పారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటు చంద్రబాబు మాయమాటలు..ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారని జగన్ ఆరోపించారు.

2014లో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు కొత్తగా ఇచ్చే హామీలను అమలు చేస్తాడని చెప్పడంలో విశ్వసనీయత లేదన్నారు. ఆనాడు రుణమాఫీ, డ్వాక్రా రుణాణు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని చెప్పి ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ పాలనతోనే మీకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మీ బిడ్డ జగన్‌ను ఓడించేందుకు చంద్రబాబు, జనసేన, బీజేపీలు కూటమిగా ఏకమై వస్తున్నాయని, వారికి కాంగ్రెస్ తోడైందని విమర్శించారు. ఈ ఎన్నికల పోరాటంలో మీ బిడ్డ జగన్‌కు అండగా మీరే సైనికులుగా ఉండి పోరాడాలనని, మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించాలని కోరారు.

Latest News