Site icon vidhaatha

CM Revanth Reddy । వారి ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడానికే పేదలను అడ్డం పెట్టుకుంటున్న బీఆరెస్‌ నేతలు

CM Revanth Reddy । హైదరాబాద్  నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సిఖ్‌ విలేజ్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆరెస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళనపై మాట్లాడుతూ కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడిని తెలంగాణ సమాజం గమనిస్తోందని బీఆరెస్ నేతలను హెచ్చరించారు. పదేళ్లుగా మీరు దోచుకున్న సొమ్ము మీ పార్టీ ఖాతాలో  రూ.1500 కోట్లు మూలుగుతున్నదని, అందులో నుంచి  రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టండని బీఆరెస్ నాయకులను  రేవంత్ డిమాండ్ చేశారు. మూసీపై ఏమి చేయాలో ప్రత్యామ్నాయం చెప్పండి… ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు.  హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  మూసీ మురికిలో బ్రతుకుతున్న పేదలకు ఇళ్లు ఇవ్వడంతో పాటు రూ.25వేల నగదు కూడా ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని తెలిపారు.

మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని బీఆరెస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్… అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌజ్ లు కూల్చాలా వద్దా?, సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయి.. వాటిని కూలగొట్టాలా వద్దా..? అని అడిగారు. నల్లచెరువులో, మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా..? అని సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్ నాయకులను ప్రశ్నించారు. 20 ఏళ్లు ప్రజల్లో తిరిగిన తనకు పేద ప్రజల కష్టాలు తెలుసని రేవంత్‌రెడ్డి చెప్పారు. మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారని బీఆరెస్ నేతలను నిలదీశారు. జవహర్ నగర్ లో 1000 ఎకరాల భూమి ఉందని, అందులో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు.

ఇక్కడి ఎంపీ మోదీ దగ్గర నుంచి ఏం తీసుకొస్తారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్‌ను డిమాండ్ చేశారు.  సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు కానీ.. మూసీని అభివృద్ధి చెయ్యొద్దా? అని ఈటలను ప్రశ్నించారు. మొత్తం మంత్రివర్గాన్ని తీసుకువస్తా.. మోదీ వద్దకు తీసుకెళ్లి ఈటెల రూ.25వేల కోట్లు నిధులు ఇప్పించగలరా… అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటల మాట్లాడుతున్నారన్నారు. బీఆరెస్, బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా… నగరంలో చెరువుల లెక్క, ఆక్రమణల లెక్క తీద్దాం రండి అని సీఎం రేవంత్ వారిని ఆహ్వానించారు.  వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే చెరువులు, నాలాలు మూసుకుపోయాయని… ఇలాగే చూస్తే.. ఇంకొన్నాళ్లకు మూసీ కూడా మూసుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నాకు లోతు తెలియక కాదు.. నగరానికి మంచి భవిష్యత్తును అందించేందుకే తమ చర్యలుంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదవాడి కన్నీళ్లు చూడలని కోరుకోవడంలేదన్నారు. ప్రతీ పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చెరువులు, నాలాలు, మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే… పేదలకు ఎలా న్యాయం చేద్దామో మీరు అది చెప్పండని ప్రతిపక్షాలను కోరారు. ఇళ్లు లేని పేదలకు ఇండ్లు ఇవ్వడం నేరమా? విషాన్ని దిగమింగుతున్న నల్లగొండ ప్రజలను కాపడలనుకోవడం తప్పా? మీకు ఓటు వేయనందుకు నల్లగొండ ప్రజలను చంపేయాలని చూస్తారా? అని బీఆరెస్ నేతలను సీఎం రేవంత్  నిలదీశారు.

సంక్షేమ పథకాలు అందించేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు

ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ  నుంచి 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామన్నారు.  ప్రతి పేద వాడికి రేషన్ కార్డు అందించాలని మా ప్రభుత్వం  సంకల్పించిందన్నారు. కొంతమందికి రేషన్ కార్డుకి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరుస్తామని తెలిపారు. 30శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.  వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. మీ కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందన్నారు. అన్ని సంక్షేమ పథకాలు ఒకే కార్డు ద్వారా అందించనున్నామని తెలిపారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తామన్నారు.  కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version