Site icon vidhaatha

Miryalaguda | అలా చేస్తే.. ఏ నాయకుడు, ఏ పార్టీ మిగలదు: గుత్తా సుఖేందర్​రెడ్డి

విధాత: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూలో ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే పనిగా కేంద్రం పెట్టుకుందని ధ్వజమెత్తారు. సిబిఐ, ఈడి, ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతో కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందన్నారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను జీఎస్టీ పేరుతో హరిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విభజన చెంది తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కేంద్రం కృష్ణ గోదావరి జలాలలో వాటా ఇప్పటివరకు తేల్చ లేదని విమర్శించారు. విభజన చట్టాల్లోని చాలా అంశాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు.

ఏ పార్టీ మిగలదు..

రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం చర్య అప్రజాస్వామికమైందన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, అలా చర్యలు చేసుకుంటూ పోతే ఏ నాయకుడు, ఏ పార్టీ మిగలదని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవస్థను వివాదాస్పదం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు.

వామపక్షాలతో మునుగోడు ఎన్నికల్లో కలిసి పని చేసిన మాట వాస్తవమని, కానీ భవిష్యత్తులో ఇరుపక్షాలు కలవాలని ఉంటే కలిసి పని చేస్తామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కరరావు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే భాస్కరరావు మళ్లీ భారీ మెజార్టీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version