Site icon vidhaatha

కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కమిషన్…బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : జగదీష్ రెడ్డి

విధాత : కాళేశ్వరం కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించారు. బుధవారం ఆత్మకూరు మండలం, నెమ్మికల్ గ్రామంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా..ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు..తోపులాటకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాబినేట్ మీటింగ్ పెట్టి.. ఏం చెప్పాలో అర్థం కాక నోరు మూసుకున్నారన్నారు. కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్, బీజేపీల ఆరోపణల చిట్టాగా అభివర్ణించారు. పూర్తి నివేదిక వెల్లడించకుండా నాటకాలు వేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడితే మోదీ..చంద్రబాబు డైరక్షన్‌లో బనకచర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను చీల్చి చెండాడుతామన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయువుపట్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం జలాలలో మొదటి లబ్ధి పొందింది సూర్యాపేట జిల్లా ప్రజలేనని గుర్తు చేశారు. కేసీఆర్ సాగునీటి పథకాలు అందించిన ఫలితాలతోనే ఈ రోజు కాంగ్రెస్ సన్న బియ్యం ఇవ్వగలుగుతుందని జగదీష్ రెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తూ..కాళేశ్వరం నివేదికతో రచ్చ చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పేరుతో ఢిల్లీలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని జగదీష్ రెడ్డి విమర్శించారు.

 

Exit mobile version