Site icon vidhaatha

చంద్రబాబు క్యాబినెట్‌లో ఉండబోయేది వీరేనా?

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. తన డిప్యూటీగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు తీసుకుంటారనే విషయంలో పెద్దగా అనుమానాలు లేకపోయినా.. క్యాబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందనేదానిపై అంచనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేశ్‌, మాజీ మంత్రి నారాయణ, జన సేన నుంచి నాదెండ్ల మనోహర్‌కు బెర్తులు ఖాయమైనట్టు చెబుతున్నారు. పూర్తిస్థాయిలోనే మంత్రివర్గం ఏర్పడుతుందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐదారు మంత్రి పదవులు జనసేన, బీజేపీకి దక్కుతాయని చెబుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం. మంత్రిపదవులు కేటాయించే సమయంలో ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిసింది. బీసీలకు 8, ఎస్సీలకు 2 మంత్రి పదవులతోపాటు.. ఎస్టీ, ముస్లింల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కుతుందని సమాచారం.

Exit mobile version