KTR | ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: కేటీఆర్‌

ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కోంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని లేదంటే రైతుల పక్షాన బీఆరెస్ ఆందోళనలకు సిద్ధమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

  • Publish Date - May 15, 2024 / 03:46 PM IST

రైతుల కోసం ఆందోళనలకు సిద్ధం
గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాటం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కోంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని లేదంటే రైతుల పక్షాన బీఆరెస్ ఆందోళనలకు సిద్ధమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నల్లగొండ,ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

రాజకీయాలకు అతీతంగా రైతుల ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులు నిలిచిపోయాయని, నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి రైతులు కొనుగోలు కోసం ఇళ్లకు దూరంగా అక్కడే పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌, ఖమ్మం జిల్లాల్లో రైతులు ధాన్యం కొనుగోలు సమస్యలపై రోడ్డెక్కి నిరసన తెలిపినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

కొనుగోలు ప్రక్రియలో తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలకు చాలచోట్ల కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిచిందని.. రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్వింటాకు రూ.500 ఇచ్చే వరకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకునేందుకు పోరాటం

ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటికే బీఆరెస్‌ నాలుగు సార్లు విజయం సాధించిందని, ఈ దఫా కూడా ఈ స్థానంలో బీఆరెస్ గెలిచేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలంతా సమిష్టిగా పోరాడుతామని కేటీఆర్ చెప్పారు. పట్టభద్రులు అంతా బీఆరెస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోజు కావలసింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలన్నారు.

మీడియాను అడ్డుపెట్టుకునే ఒక బ్లాక్ మెయిలర్‌ను, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వ్యక్తిని ఎన్నుకుంటే నిరుద్యోగులకు, ప్రజలకు నష్టం జరుగుతుందని, మరో నయీమ్‌గా మారుతాడన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడు, యువకుడైన వ్యక్తి శాసనమండలికి ఎన్నిక కావాలన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత హామీలు గుర్తు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అని వాగ్ధానం చేసి ఇప్పుడు దాని గురించే మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్ష ఫీజు రూ.200 ఉంటే… నేడు కాంగ్రెస్ సర్కార్ రూ.2 వేలు చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలను నిరుద్యోగ యువత నమ్మితే మోసపోతారని హెచ్చరించారు.

Latest News