స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉంటా.. గెలిచి చూపిస్తా: సోమారపు సత్యనారాయణ

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన ఖండించారు. గోదావరిఖని శివాజీ నగర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఏ గుర్తువస్తుందో అదే గుర్తుపై పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గంలో చాలామంది నా సహకారం కోరుకుంటున్నారని అన్నారు.


ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజలు చేసిన పనులను మర్చిపోరని తెలిపారు. రామగుండంలో నేను గెలిచే అవకాశం ఉందన్నారు. విద్యావంతుడిగా, అనుభవం ఉన్న నాయకుడిగా, సమర్థవంతమైన నిజాయితీ పాలనను అందిస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీ గెలిచినా ఎలా పని చేయించుకోవాలో నాకు తెలుసని అన్నారు. నియోజకవర్గంలో సోమారపు సత్యనారాయణకంటూ ఒక ప్రత్యేకత ఉందని, నా నిజాయితీనే నన్ను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.