సియాచిన్‌లో వైద్య అధికారిగా మొద‌టి సారి మ‌హిళ

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ (Siachen Battle Field) అద్భుత ఘ‌ట్టానికి సాక్ష్యంగా నిలిచింది.

  • Publish Date - December 7, 2023 / 10:34 AM IST

విధాత‌: ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ (Siachen Battle Field) అద్భుత ఘ‌ట్టానికి సాక్ష్యంగా నిలిచింది. ఇక్క‌డ వైద్యురాలిగా సేవ‌లు అందించ‌డానికి తొలి సారిగా మ‌హిళ‌ను ఎంపిక చేస్తూ సైన్యం నిర్ణ‌యం తీసుకుంది. ఆర్మీకి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె ఇప్ప‌టికే సియాచిన్ యుద్ధ శిక్ష‌ణా కేంద్రంలో క‌ఠిన‌మైన శిక్షణ పూర్తి చేసుకున్నార‌ని ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఎక్స్‌లో ప్ర‌క‌టించింది. స్నో లెప‌ర్డ్ బ్రిగేడ్‌కు చెందిన కెప్టెన్ గీతికా కౌల్ సియాచిన్‌లో నియ‌మితుల‌వుతున్న తొలి వైద్య అధికారిణిగా రికార్డు సృష్టించ‌నున్నారు.


అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌ను ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా పూర్తి చేశారు అని వెల్ల‌డించింది. కాగా సియాచిన్ యుద్ధ శిక్ష‌ణా కేంద్రంలో ఇచ్చే శిక్ష‌ణ చాలా క‌ఠిన‌మైన‌ద‌ని చెబుతారు. అత్యంత ఎత్తైన ప్ర‌దేశాల్లో ఊపిరి అంద‌ని చోట యుద్ధం చేయ‌డం, అనారోగ్యానికి గురి కాకుండా ఉండ‌టం, త‌క్కువ ఆహారం తీసుకుని బ‌లంగా ఉండ‌టం వంటి అడ్డంకుల‌ను ఇక్క‌డ దాటాల్సి ఉంటుంది. హిమాల‌య ఉత్త‌ర ప్రాంతంలో ఉండే సియాచిన్ యుద్ధ క్షేత్రం ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన‌ది.


దీనిని పాకిస్థాన్ త‌న‌ది అని వాదిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం భార‌త్ అధీనంలోనే ఉంది. ఇక్క‌డి అతి క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణం ఏ మాత్రం అప్ర‌మ‌త్తంగా లేక‌పోయినా ప్రాణాలు తీసేస్తుంది. 2015లో పార్లెమెంటు వెల్ల‌డించిన ప్ర‌కారం.. 1984 నుంచి 2015 వ‌ర‌కు అక్క‌డ 869 మంది సైనికులు అమ‌రుల‌య్యారు. ఈ అంద‌రి మ‌ర‌ణాల‌కు అక్క‌డి వాతావ‌ర‌ణ‌మే కార‌ణం. 5400 మీట‌ర్ల ఎత్తున ఉండే ఈ ప్రాంతంలో ఉష్ణోగ‌త్ర మైన‌స్ 45 డిగ్రీల‌కు కూడా ప‌డిపోతుంది. అందుకే ఇక్క‌డ సైనికులను ఒక కాల ప‌రిమితికి మించి పోస్ట్ చేయ‌ర‌ని నిపుణులు చెబుతున్నారు.

Latest News