Covid | దేశ వ్యాప్తంగా మళ్లీ కొవిడ్ పాజిటివ్( Covid Positive ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) సూచించారు. అవసరమైన చోట కొవిడ్ పరీక్షలు( Covid Tests ) పెంచాలని ఆదేశించారు. గత రెండు వారాల నుంచి ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.
తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించి, పరీక్షలను పెంచాలని సూచించారు. ఇన్‌ఫ్లుయెంజా, కరోనా కేసులను గుర్తించి పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. దీంతో కొత్త వేరియంట్లను త్వరగా గుర్తించగలుగుతామని మోదీ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలన్నారు. వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దేశంలో రోజుకు సగటున 888 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మోదీకి వివరించారు. దీంతో 20 రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచామన్నారు. ఇక 2020లో కరోనా కేసులు పెరిగినప్పుడు మోదీ మార్చి 22నే జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. మళ్లీ మూడేండ్ల తర్వాత అదే రోజు వైరస్‌ల విస్తృతిపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం గమనార్హం.