HomelatestDharani | ‘ధరణి’తో సమస్యలు జటిలం.. సులువుగా పరిష్కరించే మార్గం లేదా: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

Dharani | ‘ధరణి’తో సమస్యలు జటిలం.. సులువుగా పరిష్కరించే మార్గం లేదా: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

Highcourt | Dharani

  • కారణాలు చెప్పకుండా దరఖాస్తు తిరస్కరించకూడదు
  • పాత చట్టం ప్రకారం ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇస్తున్నాం
  • ధరణి సమస్యలన్నీ పరిష్కరించి జూన్‌15 వరకు సమాధానం ఇవ్వండి: సీసీఎల్‌ఏకు ఆదేశం
  • 17 పేజీల తీర్పును వెల్లడించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ కె. లక్ష్మణ్‌

విధాత: ధరణి సమస్యల పుట్ట అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తేటతెల్లమైంది. ధరణి ద్వారా సమస్యలు సులువుగా పరిష్కారం కావాలి కానీ జఠిలం కాకూడని వ్యాఖ్యానించారు. ధరణి కూడా దళారులను ఆశ్రయించేలా ఉందని న్యాయమూర్తి కె. లక్ష్మన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ధరణి ద్వారా రైతులు ఎదుర్కొంటున్న దుస్థితికి అద్దం పడుతున్నది.

ధరణి మాడ్యూల్‌ వచ్చిన తరువాత చిన్న చిన్న కేసులు కూడా హైకోర్టుకు వస్తున్నాయి. ఇలా హైకోర్టుకు వచ్చిన సమస్యలను పరిశీలిస్తే ఆర్‌ ఓఆర్‌ చట్టం ప్రకారంగా 20 రకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ధరణిలో వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించకుండా టెక్నికల్‌ కారణాలతో తిరస్కరిస్తున్నారన్నారు. ధరణిలో వచ్చిన దరఖాస్తును తిరస్కరించకుండా పరిష్కరించాలన్నారు. పరిష్కరించడానికి వీలు లేని వాటికి ఎందుకు తిరస్కరించారో కూడా కారణాలు చాలా స్పష్టంగా చెప్పాలని సీసీఎల్‌ఏను ఆదేశించారు.

కొత్త ఆర్‌ ఓ ఆర్‌ చట్టం రాకముందు భూమి సమస్యలపై కొన్ని ఆర్డర్లు పాస్‌ అయ్యాయని, కొత్త చట్టం ప్రకారం వాటిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం లేదని తెలిపారు. అయితే కొత్త చట్టం వచ్చే నాటికి ఉన్న పెండింగ్‌ కేసును ట్రిబ్యునల్‌కు వెళ్లాలని గవర్నమెంట్‌ చెప్పిందన్న న్యాయమూర్తి.. పాత చట్టం ప్రకారం వచ్చిన ఆర్డర్‌లపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇవ్వాలని సీసీఎల్‌ఏను ఆదేశించారు. దీనికి సీసీఎల్‌ఏ సమ్మతం తెలిపారు. దీంతో కొత్త చట్టం రాకముందు ఇచ్చిన ఆదేశాలపై ఆ చట్టం ప్రకారం అప్పీల్‌ చేసుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఈమేరకు తన భూమిపై జరిగిన అక్రమ లావాదేవీలను గుర్తించడానికి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, వట్టి నాగులపల్లి గ్రామానికి చెందిన భూ యజమాని వై. జైహింద్‌రెడ్డి వేసిన W.P.Nos. 39609, 45906, 46008 / 2022లలో న్యాయమూర్తి జస్టీస్‌ కె.లక్ష్మణ్‌ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులు, ధరణిలో భూమి సమస్యలున్న వారందరికీ ఉపయోగపడే విధంగా సవివరంగా 17 పేజీల సాధారణ తీర్పు ఇచ్చారు.

సీసీఎల్‌ఏను ఏకంగా హైకోర్టుకు పిలించిన న్యాయమూర్తి ఇలాంటి సమస్యలన్నింటిని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు మండల స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యలన్నీ గుర్తించి, వాటిని పరిష్కరించి జూన్‌ 15వ తేదీ నాటికి రిపోర్ట్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం కోసం, భూమి యజమానుల కోసం హైకోర్టు తీర్పు పూర్తి పాఠం తెలుగు, ఇంగ్లీష్‌ భాషలలో మీకోసం..

కామన్‌ ఆర్డర్‌

1. W.P.Nos.39609, 45906, 46008 of 2022లలో పిటిషన్‌దారు వై. జైహింద్‌రెడ్డి తరపున న్యాయవాది అశోక్‌రెడ్డి కణతాల, శెట్టి రవితేజ తరఫు న్యాయవాది ప్రభాకర్‌ శ్రీపాద శెట్టి, W.P. No.10150 of 2023 పిటిషనర్‌ తరఫు న్యాయవాది, ప్రతివాదుల పక్షాన అడ్వకేట్‌ జనరల్‌ తరఫున స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ హరేందర్‌ పెర్‌షాద్‌ వాదనలు వినటం జరిగింది.

2. పైన పేర్కొన్న పిటిషన్లన్నీ వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌ ద్వారా జరిగిన సేల్‌ డీడ్‌లు, సక్సెషన్‌ ప్రొసీడింగ్స్‌, పార్టిషన్‌ డీడ్స్‌కు సంబంధించి సర్టిఫైడ్‌ కాపీలు ఇచ్చేలా తహసీల్‌దార్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలయ్యాయి. దానితోపాటు పహాణీలు, చేసాల తదితర సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వడం లేదని, సదరు కాపీలు ఇప్పించేందుకు రెవెన్యూ అధికారులను నిర్దేశించాలని కోరుతూ దాఖలైనవి.

3. ఈ దావాలో ఉన్న పైన పేర్కొనబడిన రిట్‌ పిటిషన్‌లు అన్నీ ఒకే విధమైనవి కనుక అన్ని రిట్‌ పిటిషన్లను కలిపి విచారించి, ఈ కామన్‌ ఆర్డర్‌ ద్వారా పరిష్కరించడమైనది.

4. ప్రస్తుతం దాఖలైన రిటి పిటిషన్లకు సంబందించిన దావాలపై చర్చించే ముందు తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్ 1971 (ఆర్‌వోఆర్‌ యాక్ట్‌-1971గా పిలవబడుతుంది) స్థానంలో తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌, 2020ను (ఆర్‌వోఆర్‌ యాక్ట్‌-2020గా పిలవబడుతుంది) కింద పేర్కొన్న ఉద్దేశాలు, లక్ష్యాలతో తీసుకు వచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

‘భూమికి సంబంధించిన క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాల్లో, అలాగే ఆర్‌వోఆర్‌-1971లోని సెక్షన్‌ 6 బీ, సెక్షన్‌ 6 సీ ప్రకారం ఏదైనా రుణ సంస్థ నుంచి రుణాలు తీసుకోవాలన్నా పట్టదార్‌ పాస్‌పుస్తకాలు అందించాలని భూ యజమానులపై ప్రస్తుతం ఒత్తిడి ఉన్నది. భూమి బదలాయింపు తర్వాత తమ భూములను మ్యుటేషన్‌ చేయించుకోవడంలో, పాస్‌బుక్కులు, టైటిట్‌ డీల్స్‌ను ఇచ్చి రుణాలు తీసుకోవడంలో రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్న అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.

భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ధరణి పోర్టల్‌లో కంప్యూటీకరించినందున ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టం స్థానంలో తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టదార్‌ పాస్‌బుక్స్‌ చట్టం 2010ని తీసుకురావాలని నిర్ణయించింది. దాని లక్ష్యాలు కింద పేర్కొనబడినవి..

(1) తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (టీఎల్‌ఆర్‌ఎంఎస్‌)లో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో హక్కుల రికార్డులను నిర్వహించడం, సెంట్రలైజ్డ్‌ స్టోరేజ్‌ డివైజ్‌లలో ఎలక్రానిక్‌ పద్ధతిలో నిర్వహించే రెవెన్యూ రికార్డులను ధ్రువీకరించడం, టీఎల్‌ఆర్‌ఎంఎస్‌, మీసేవ వంటి పోర్టళ్ల ద్వారా అమలు చేయడం.
(2) టైటిల్‌ డీడ్‌, పాస్‌బుక్‌లను టైటిల్‌ డీడ్‌ కమ్‌ పాస్‌బుక్‌గా మార్చి, ల్యాండ్‌ హోల్డర్లు/యజమానులు ఎలక్ట్రానిక్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ కమ్‌ టైటిల్‌ డీడ్‌ను పొందేందుకు అవకాశం కల్పించడం.
(3) యూజర్‌ ఏజెన్సీలు పాస్‌బుక్‌ ఇవ్వాల్సిన అవసరాన్ని తగ్గించడం.
(4) తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (టీఎల్‌ఆర్‌ఎంఎస్‌) తదితరాల్లోని డాటేబేస్‌ ద్వారా సెంట్రలైజ్డ్‌ స్టోరేజ్‌ డివైజ్‌లలో ఎలక్ర్టానికల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న రెవెన్యూ రికార్డుల ఆధారంగా బ్యాంకులు, రుణ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు వీలు కల్పించడం, తద్వారా ఎలాంటి రెవెన్యూ రికార్డులను భౌతికంగా అందించాలని రైతులను ఒత్తిడి చేయకుండా చూడటం.
(5) ప్రాపర్టీ బదలాయింపు తర్వాత సత్వరమే ఆటోమేటిక్‌గా హక్కులు కల్పించడం.
(6) ఇది సులభ వాణిజ్య విధానం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) లక్ష్యాలను సాకారం చేయడమే కాకుండా శాఖలో మరింత జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంచుతుంది.
(7) రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూములను రక్షించేందుకు.
(8) రెవెన్యూ పాలనా యంత్రాంగంలో పారదర్శకతను పెంచేందుకు.
(9) రెవెన్యూ పరిపాలనలో అవినీతికి చరమగీతం పాడి.. మంచి పద్ధతులు నెలకొల్పేందుకు.
(10) స్మార్ట్‌ అండ్‌ గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా జవాబుదారీతనంతో కూడిన, బాధ్యతాయుత రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని రూపొందించేందుకు.
(11) ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఆటంకాలు లేని రెవెన్యూ వ్యవస్థను నెలకొల్పేందుకు.

5. రెవెన్యూ రికార్డుల నిర్వహణను డిజిటైజ్‌ చేయడం, భూములు తమ పేరిట మ్యుటేషన్‌ చేయించుకోవడంలో పౌరులకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడం అనే మంచి ఉద్దేశాలతో ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020 తెచ్చారనేది స్పష్టం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భూములకు సంబంధించిన సమాచారం మొత్తం ఆన్‌లైన్‌లో ఉండేందుకు ధరణి పేరుతో పోర్టల్‌ను రూపొందించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో తెలంగాణలోని భూమి టైటిల్‌ హోల్డర్ల సమాచారాన్ని రికార్డు చేసే ఏకైక కేంద్రంగా ధరణి పోర్టల్‌ ఉండాలి. ఇది మ్యుటేషన్‌/సక్సెషన్‌, ల్యాండ్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్‌, లాండ్‌ కన్వర్షన్‌, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, తదితర ఆన్‌లైన్‌ సర్వీసులను పౌరులకు అందిస్తుంది.

6. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో మానవ జోక్యాన్ని తగ్గించడం, సాగదీత ధోరణలకు చెల్లు చీటీ ఇవ్వడం అనే ఆలోచనతో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు. భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతికి అడ్డుకట్ట వేయడం, జాప్యాలు, అక్రమాలు నిరోధించడం అనే లక్ష్యం కూడా ఉన్నది. ఏది ఏమైనా ధరణి పోర్టల్‌ను ఆశ్రయించినప్పుడు పౌరులు ఇంకా అనేక ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటున్నారనేందుకు ఈ కేసు స్పష్టమైన ఉదాహరణ.

7. పైన పేర్కొన్న విధంగా, ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్ల సర్టిఫైడ్‌ కాపీలను ఇవ్వడానికి సంబంధిత తహసీల్‌దార్‌లు నిరాకరించడంతో ఇబ్బందులకు గురైనవారు ప్రస్తుత పిటిషన్లు దాఖలు చేశారు.

8. ‘సర్టిఫైడ్‌ కాపీ’ అనే పదానికి ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లోని సెక్షన్‌ 2 (1)లో నిర్వచించిన విషయం గమనించాలి. కనుక ఇదే అంశం ప్రస్తుత కేసు ఉద్దేశానికి సంబంధం కలిగి ఉన్నది. అందులో ఇలా ఉన్నది. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, 1872లోని సెక్షన్‌ 76లో ధ్రువీకరించిన విధంగా.. సర్టిఫైడ్‌ కాపీ లేదా సర్టిఫైడ్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌ అంటే.. ధరణి నుంచి తీసుకున్న ఒక కాపీ లేదా ఎక్స్‌ట్రాక్ట్‌.

9. పై నిర్వచనాన్ని గమనిస్తే.. ధరణి నుంచి పొందాలని కోరుకున్న డాక్యుమెంట్ల తాలూకు సర్టిఫైడ్‌ కాపీలను ఇవ్వాలని ఆర్‌వోఆర్‌ చట్టం 2020 స్పష్టంగా పేర్కొంటున్నది. కనుక ధరణి నుంచి పొందే కాపీని సర్టిఫైడ్‌ కాపీగా చట్టం స్పష్టంగా పేర్కొంటున్నందున ప్రతివాదులు సదరు సర్టిఫైడ్‌ కాపీలను జారీ చేసేందుకు తిరస్కరించజాలరు.

10. అయితే.. విచారణ సందర్భంగా సంబంధిత తహసీల్‌దార్‌ 01.11.2022న రాతపూర్వకంగా అందిన సూచనలను కోర్టుకు సమర్పించారు. అందులో ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020కింద రిజిస్టరయిన ఒరిజినల్‌ సేల్‌డీడ్స్‌ యొక్క స్కాన్డ్‌ కాపీలు మాత్రమే ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయ్యాయని, ఒరిజినల్‌ సేల్ డీడ్‌ పత్రాలు సంబంధిత కొనుగోలు దారులకు అందించినట్టు, సదరు సేల్‌డీడ్‌లకు సంబంధించిన అదనపు కాపీలు ఆఫీసులో నిల్వ చేసి లేవని పేర్కొని ఉన్నది. దానితోపాటు, ధరణి పోర్టల్‌లో రిజిస్టరయిన డాక్యుమెంట్ల సర్టిఫైడ్‌ కాపీలను జారీ చేసేందుకు ఆర్‌వోఆర్‌ చట్టం 2020లో ఎలాంటి మార్గదర్శకాలు లేవని పేర్కొని ఉన్నది.

11. 01.11.2022 తేదీతో ఉన్న రాతపూర్వక సూచనలు.. ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లో పేర్కొన్న ‘సర్టిఫైడ్‌ కాపీ’ నిర్వచనానికి, చట్టం లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నందున ప్రస్తుత పిటిషన్లపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా ఈ కోర్టు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆదేశించడం జరిగింది.

12. తదుపరి విచారణ తేదీన రెవెన్యూ శాఖ తరఫున అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ కోర్టును సమయం కోరుతూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) దృష్టికి తీసుకువెళ్లారని, అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. తదనంతరం, ధరణి పోర్టల్‌ నుంచి ఏదైనా డాక్యుమెంట్‌కు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీని పొందేందుకు పౌరులు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు/పద్ధతులకు సంబంధించిన వివరాలు అందజేయడంలో కౌంటర్‌ అఫిడవిట్‌ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ విఫలమయ్యారు. కనుక, 25.04.2023న సీసీఎల్‌ఏ స్వయంగా కోర్టుకు హాజరై, ధరణి పోర్టల్‌ను యాక్సెస్‌ చేసే విషయంలో పౌరులు పడుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను ఉద్దేశించి చెప్పాలని ఈ కోర్టు 24.04.2023న ఆదేశించడమైనది.

13. 24.04.2023 నాటి ఆదేశాల మేరకు ఈ రోజు సీసీఎల్‌ఏ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ధరణిలో మీసేవ పోర్టల్‌ పేరుతో ఒక ఆన్‌లైన్‌ పోర్టల్ ఏర్పాటు చేశామని, ఈ పోర్టల్‌ ద్వారా పిటిషనర్లు డాక్యుమెంట్ల సర్టిఫైడ్‌ కాపీలు కోరుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకుంటే సదరు అప్లికేషన్లను పరిశీలించి, సర్టిఫైడ్‌ కాపీలను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

14. సీసీఎల్‌ఏ పైన పేర్కొన్న నివేదన మేరకు, ధరణిలోని మీసేవ పోర్టల్‌ ద్వారా పిటిషనర్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తూ ఈ అన్ని పిటిషన్లను డిస్పోజ్‌ చేస్తున్నాం. సదరు అప్లికేషన్లు దాఖలైనప్పుడు ప్రతివాదులు వాటిని పరిగణనలోకి తీసుకుని, చట్టంలో పేర్కొన్న పద్ధతులను అనుసరిస్తూ సర్టిఫైడ్‌ కాపీలను జారీ చేయాలి. పిటిషనర్లు దాఖలు చేసిన దరఖాస్తులను ప్రతివాదులు ఆమోదించలేని పక్షంలో వారు తప్పనిసరిగా నిర్దిష్ట కారణాన్ని పేర్కొనాలి. దానితోపాటు సహేతుకమైన కారణాన్ని వెల్లడిస్తూ సదరు పిటిషనర్‌కు దానిని అందించాలి. ఆన్‌లైన్‌లో పిటిషనర్ల దరఖాస్తు అందిన ఎనిమిది వారాల్లో వారు ఈ పనిని పూర్తి చేయాలి. ఈ కేసు పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వడం లేదు. దీని పర్యవసానంగా, రిట్‌ పిటిషన్లలో ఏమైనా పెండింగ్‌లో ఉన్నట్టయితే అవన్నీ ముగిసినట్టే.

15. పైన పేర్కొన్న విధంగా, ధరణి పోర్టల్‌ను ఆశ్రయించిన సమయంలో పౌరులు వివిధ స్థాయిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక అంశాలపై ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020 మౌనంగా ఉంటున్నదని కోర్టు గమనించింది, గుర్తించింది. ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020కు సంబంధించిన అంశాలు స్థూలంగా కింద చర్చించబడినవి.

16. కోర్టు డిక్రీ ద్వారా హక్కులు పొందినట్లయితే హక్కు పత్రాల్లో మార్పులు చేసేందుకు ఆర్‌వోఆర్‌ చట్టం 2020లోని సెక్షన్‌ 7 అనుమతిస్తున్నది. కానీ.. డిక్రీ స్వభావంపై అంటే కోర్టు డిక్రీనా? సొమ్ము రికవరీకి దాఖలు చేసిన సూట్‌లో పొందిన డిక్రీనా? లేదా పర్మినెంట్‌ ఇన్‌జంక్షన్‌ సూట్‌ ద్వారా పొందిన డిక్రీనా? లేక ఇతర ఏదైనా డిక్రీనా? అన్న విషయంలో స్పష్టత లేదు. అంతేకాకుండా.. హక్కు పత్రాల్లో మార్పులకు ఎంత కాలం పడుతుందో ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లోని సెక్షన్‌ 7లో పేర్కొనలేదు. దీని ఫలితంగా ఎప్పుడో 1986లో పొందిన కోర్టు డిక్రీలను ఆధారం చేసుకుని హక్కు పత్రాల్లో మార్పులను కక్షిదారులు కోరుతున్నారు.

17. ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020కి అనుగుణంగా సీసీఎల్‌ఏ 15.01.2021న సర్క్యులర్‌ నెం.1/2021 జారీ చేస్తూ.. వివరాల రెక్టిఫికేషన్‌/కరెక్షన్‌, ఈ-పట్టాదార్‌ పాస్‌ బుక్‌ జారీ, వారి పేర్ల మ్యుటేషన్‌ సహా భూమికి సంబంధించిన ఏ అంశంలోనైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇదే సర్క్యులర్‌ సర్వే, సబ్‌డివిజినల్‌ సర్వే కోసం ఎఫ్‌-లైన్‌ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారులు ఆన్‌లైన్‌ అప్లికేషన్లను అవి దాఖలైన తేదీ నుంచి ఒక వారం వ్యవధిలో, ఎఫ్‌-లైన్‌ అప్లికేషన్లను 45 రోజులలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ.. సదరు ఆన్‌లైన్‌/ఎఫ్‌-లైన్‌ దరఖాస్తుల విషయంలో జిల్లా కలెక్టర్‌/రెవెన్యూ అధికారులు తగిన విధంగా వ్యవహరించడం లేదని అనేక కేసులలో ఈ కోర్టు గుర్తించింది. అంతేకాకుండా, చాలా కేసులలో జిల్లా కలెక్టర్లు/రెవెన్యూ అధికారులు సదరు ఆన్‌లైన్‌/ఎఫ్‌-లైన్‌ దరఖాస్తులను కేవలం ‘తిరస్కరించడమైనది’ అనే ఒకే ఒక్క పదం రాసి తిరస్కరిస్తున్నారు. అందుకు కారణాలను పేర్కొనడం లేదు. ఎలాంటి కారణాలు చూపని ఉత్తర్వులు చెల్లవు. ఇలాంటి చర్యలతో అధికారులు పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుజేస్తున్నారు. అందుకే వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో పెండింగ్‌ కేసుల భారం పెరిగిపోతున్నది.

18. కోర్టు మరో సమస్యను కూడా గుర్తించింది. వివరాల్లో తప్పులను సరి చేయాలని దరఖాస్తు చేసుకుంటే.. దరఖాస్తు నిర్దిష్ట మాడ్యూల్‌లో లేనందున తిరస్కరించారంటూ ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన నిరక్షరాస్యురాలైన మహిళా రైతు కోర్టును ఆశ్రయించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక నిరక్షరాస్యురాలైన ఒక మహిళ నిర్దిష్ట మాడ్యూల్‌లో దరఖాస్తు చేయగలరని ప్రభుత్వం ఎలా ఆశిస్తుందని కోర్టు భావిస్తున్నది. ఈ అంశాన్ని సీసీఎల్‌ఏ పరిష్కరించని పక్షంలో ఇటువంటివారు బ్రోకర్లను, ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అదే జరిగితే ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020, ధరణి పోర్టల్‌ అసలు లక్ష్యాలే దెబ్బతింటాయి.

19. ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 1971లోని అంశాల కింద రెవెన్యూ అధికారులు పాస్‌ చేసిన ఉత్తర్వులపై అప్పీలు చేసేందుకు లేదా పునఃపరిశీలన కోరేందుకు ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లో ఎలాంటి అవకాశమూ లేదనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. పై అంశంతోపాటు తెలంగాణ జనరల్‌ క్లాజెస్‌ యాక్ట్‌, 1891లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ న్యాయస్థానం రీనా మాథుర్‌ వర్సెస్‌ ది తెలంగాణ స్టేట్‌ కేసులో.. ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020 తీసుకురావడానికి ముందు రెవెన్యూ అధికారులు పాస్‌ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 1971 లోని సెక్షన్‌ 5 బీ, 5 (5) కింద, ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 1971లోని సెక్షన్‌ 9 కింద కక్షిదారులు దాఖలు చేసుకునే అప్పీళ్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నది.

20. భూమి విస్తీర్ణం, వివరాలను ధ్రువీకరించుకోకుండానే అధికారులు మొత్తం సర్వే నంబరును నిషిద్ధ భూముల జాబితాలో చేర్చుతున్నారు. అది చట్ట విరుద్ధం. దాని వల్ల పౌరులకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా వారి ఆస్తి హక్కును హరిస్తుంది. పెండింగ్ సూట్‌ పరిధిలోని ఆస్తులను మాత్రమే ధరణి పోర్టల్‌లో నిషిద్ధ భూముల జాబితాలో చేర్చాలని కోర్టు భావిస్తున్నది.

21. రిజిస్టర్డ్‌ అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీని ధరణి పోర్టల్‌ అంగీకరించడం లేదని, ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ 1872లోని అంశాలకు విరుద్ధంగా.. అసలుదారులు స్వయంగా హాజరై, వేలి ముద్రలు వేయాలనే నిబంధనలకు అధికారులు పట్టుబడుతున్నారని కోర్టు దృష్టికి వచ్చింది. అసలుదారుడు డబ్బులు మొత్తం తీసుకుని రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ రాసి ఇచ్చినప్పడు అతడి లేదా ఆమె వేలి ముద్రల కోసం పట్టుబట్టడం ఆమోదయోగ్యం కాదు.

22. చట్టం ప్రకారం జారీ అయిన పట్టదార్‌ పాస్‌బుక్‌ కమ్‌ టైటిల్‌ డీడ్‌ను టైటిల్‌ డీడ్‌గానే పరిగణించాలని, అది రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 ప్రకారం సాక్ష్యంగా పరిగణించ తగిన విలువను కలిగి ఉంటుందని ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లోని సెక్షన్‌ 11 పేర్కొంటున్న విషయం ఇక్కడ గమనించాలి. కానీ, ధరణి పోర్టల్‌కు సంబంధించి అసంఖ్యాక సమస్యలు, ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లోని నిర్దిష్ట అంశాల్లో స్పష్టత లేకపోవడాన్ని గమనిస్తే.. పట్టాదార్‌ పాస్‌బుక్‌ కమ్‌ టైటిల్‌ డీడ్‌కు సాక్ష్యంగా పరిగణించేందుకు ఉన్న విలువపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

23. పైన చర్చించిన అంశాలతోపాటు.. కోర్టు గుర్తించిన సమస్యలను స్థూలంగా గమనిస్తే..
(1) వివరాల్లో తప్పుల సవరణ, ఈ-పట్టాదార్‌ పాస్‌బుక్‌ల జారీ తదితరాలపై ఆన్‌లైన్‌లో చేసుకునే దరఖాస్తులను నిర్దిష్ట సమయం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
(2) సర్వే మరియు సబ్‌డివిజన్‌ సర్వే కోరుతూ ఎఫ్‌-లైన్‌ సర్వే కోసం దాఖలు చేసిన దరఖాస్తులను నిర్దిష్ట సమయంలో పరిగణనలోకి తీసుకోవడం లేదు.
(3) ఆక్షన్‌ పర్చేజర్లకు బ్యాంకర్లు, ఫైనాన్స్‌ సంస్థలు జారీ చేసిన సేల్‌ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
(4) ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన జనరల్‌/స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే విక్రయ లావాదేవీలు సకాలంలో జరిగేందుకు వీలుంటుంది.
(5) వివిధ ఆన్‌లైన్‌/ఎఫ్‌-లైన్‌ దరఖాస్తులను ఎలాంటి కారణాలు చూపకుండానే ‘తిరస్కరించడమైనది’ అనే ఒకే ఒక్క పదంతో తిరస్కరిస్తున్నారు.
(6) నిర్దిష్ట మాడ్యూళ్లలో లేవనే కారణంతో ఆన్‌లైన్‌ అప్లికేషన్లను తిరస్కరిస్తున్నారు.
(7) ఆర్‌వోఆర్‌ చట్టం 2020లోని సెక్షన్‌ 7లో ‘కోర్టు డిక్రీ’ అనే పదానికి సంబంధించి స్పష్టత లేదు. టైటిల్‌ మార్పునకు సంబంధించిన డిక్రీలు మాత్రమేనా లేక ఇతర సూట్లలో పాస్‌ అయిన డిక్రీలు కూడానా అనే అంశంపై స్పష్టత అవసరం.
(8) ఒక కోర్టు డిక్రీ ఆధారంగా హక్కు పత్రాల్లో మార్పులు ఎన్నిరోజుల్లో జరుగుతాయనే విషయంలో ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020లోని సెక్షన్‌ 7లో తగిన కాలపరిమితి లేదు.
(9) ఎవరైనా దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో తప్పుడు మాడ్యూల్‌లో దరఖాస్తు చేస్తే.. వెంటనే ఇది తప్పు అని పేర్కొంటూ సరైన మాడ్యూల్‌ను మానిటర్‌పై చూపాలి.
(10) ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020 తీసుకురావడానికి ముందు రెవెన్యూ అధికారులు పాస్‌ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 1971 లోని సెక్షన్‌ 5 బీ, 5 (5) కింద, ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 1971లోని సెక్షన్‌ 9 కింద అప్పీళ్లు దాఖలు చేసుకునేందుకు లేదా సవరణలు కోరేందుకు అవకాశం లేదు. కనుక ఈ విషయంలో అప్పీళ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కక్షిదారులు కోరుతున్నారు.
(11) కోర్టు కేసులు/స్టే/ ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ తదితరాల్లో మొత్తం సర్వే నంబర్‌ను నిషిద్ధ భూముల జాబితాలో చేర్చుతున్నారు. సంబంధిత షెడ్యూల్‌ ప్రాపర్టీని మాత్రమే సదరు జాబితాలో ఉంచాలి.
(12) ఆర్‌వోఆర్‌ యాక్ట్‌, 1971 కింద పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు, రివిజన్లను ఆర్‌వోఆర్‌ యాక్ట్‌, 2020 కింద ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రిబ్యునళ్లకు బదలాయించాల్సి ఉన్నది. కానీ.. సదరు పెండింగ్‌ అప్పీళ్లు, రివిజన్లు ఇంకా స్పెషల్‌ ట్రిబ్యునల్‌కు బదలాయించలేదని కోర్టు గమనించింది.
(13) వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కొంత భూమి మారినా మొత్తం సర్వే నంబర్‌ను ‘నాలా’గా ధరణి పోర్టల్‌లో చేర్చుతున్నారు.
(14) పొరపాటున ఒక సర్వే నంబర్‌ నిషిద్ధ భూముల జాబితాలోకి లేదా ప్రభుత్వ భూముల జాబితాలోకి వెళితే, దానిని తొలగించే అవకాశం ధరణి పోర్టల్‌లో లేదు.
(15) ఆర్‌ఎస్‌ఆర్‌లోని భూమి విస్తీర్ణాన్ని మార్చడానికి వెసులుబాటు లేదు.
(16) ఉమ్మడిగా కొనుగోలు చేసిన ఆస్తి లేదా ఉమ్మడి పట్టాదారుల మధ్య ఆస్తిని విభజించేందుకు అవకాశం లేదు.
(17) తన పేరిట భూమిని మ్యుటేషన్‌ చేయించుకోవాలని ఆశించిన వ్యక్తి టైటిల్‌ను ధ్రువీకరించుకోవడం అధికారులకు కష్టంగా మారింది. పౌరులు తమ ఆస్తుల లింక్‌ డాక్యుమెంట్లను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసుకునేందుకు వీలు కల్పించాలి. దాని వల్ల ఆర్‌వోఆర్‌ యాక్ట్‌, 2020 కింద గుర్తించబడిన టైటిల్‌కు సాక్ష్యంగా పరిగణించే విలువకు మరింత విశ్వసనీయత పెరుగుతుంది.
(18) చనిపోయిన విక్రేత చట్టబద్ధమైన వారసుల నుంచి పట్టా పొందేందుకు అవకాశం లేదు.
(19) తప్పుడు ఎంట్రీలను, కనిపించకుండా పోయిన సర్వే నంబర్లను చేర్చేందుకు ఆప్షన్‌ లేదు.
(20) భూ యజమాని నుంచి ప్రభుత్వం సేకరించిన భూమి వివరాలను తొలగించే అవకాశం లేదు; ప్రభుత్వం అసైన్‌ చేసిన భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు.

24. ఈ అంశాలన్నీ నిత్యం కోర్టు ముందుకు వస్తూనే ఉన్నాయి. కానీ.. పౌరులు ఎదుర్కొంటున్న అంశాలు చాలానే ఉన్నాయి. నిజంగా ఆర్‌వోఆర్‌ చట్టం 2020 లక్ష్యాలను సాధించాలంటే, పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా పైన పేర్కొన్న సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలి. పౌరులు నిత్యం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.

25. అందుకు అనుగుణంగా, ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సాధారణ ఇబ్బందులకు సంబంధించి గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల నుంచి సంబంధిత జిల్లా కలెక్టర్‌ ద్వారా సలహాలు, అభిప్రాయాలు స్వీకరించాలని సీసీఎల్‌ఏను కోర్టు నిర్దేశిస్తున్నది. తదనంతరం సదరు ఇన్‌పుట్స్‌/అభిప్రాయాలను సీసీఎల్‌ఏ పరిగణనలోకి తీసుకుని, ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ 2020 లక్ష్యాలను అమలు చేసేందుకు, ఇబ్బందులు లేని ధరణి పోర్టల్‌ను ప్రజలు ఆశ్రయించేందుకు ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను తీసుకురావాలి.

26. పైన పైర్కొన్న చర్చ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ ఇద్దరూ కలిసి, పైన పేర్కొన్న సమస్యలను ఈ ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి నాలుగు వారాల్లో పరిష్కరించి, తగిన చర్యలు తీసుకోవాలి, తమ సమ్మతి నివేదికను సమర్పించాలి.
15.6.2013 నాటికి సమ్మతి నివేదికను అందజేయాలి.
తగిన చర్యల కోసం ఈ తీర్పు కాపీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌కు రిజిస్ట్రార్‌ (జుడిషియల్‌-1) అందజేయాలి.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular