మూవీ పేరు: కృష్ణ వ్రింద విహారివిడుదల తేదీ: 23 సెప్టెంబర్, 2022నటీనటులు: నాగశౌర్య, షెర్లీ సేథియా, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులుకెమెరా: సాయి శ్రీరామ్ఎడిటింగ్: తమ్మిరాజుసంగీతం: మహతి స్వరసాగర్నిర్మాత: ఉషా ముల్పూరిదర్శకత్వం: అనిష్ ఆర్ కృష్ణ విధాత, సినిమా: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హీరో నాగశౌర్య సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రతి సినిమాకి వైవిధ్యమైన కథని అందించాలని తాపత్రయపడే నటులలో నాగశౌర్య కూడా ఒకరు. అందుకే ఆయన చేసే సినిమా సినిమాకు […]

మూవీ పేరు: కృష్ణ వ్రింద విహారి
విడుదల తేదీ: 23 సెప్టెంబర్, 2022
నటీనటులు: నాగశౌర్య, షెర్లీ సేథియా, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: మహతి స్వరసాగర్
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం: అనిష్ ఆర్ కృష్ణ

విధాత, సినిమా: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హీరో నాగశౌర్య సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రతి సినిమాకి వైవిధ్యమైన కథని అందించాలని తాపత్రయపడే నటులలో నాగశౌర్య కూడా ఒకరు. అందుకే ఆయన చేసే సినిమా సినిమాకు వెరియేషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా బ్రాహ్మాణ యువకుడి పాత్రలో ఈ సినిమాలో నటించినట్లుగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది చెబుతూ వచ్చాయి. అలాగే కొత్త హీరోయిన్ అందచందాలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాలో ఏదో కాస్త విషయం ఉందనేలానే అనిపించింది.

ఇక నాగశౌర్య ఎప్పుడూ లేనిది.. టాలీవుడ్‌లోనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ.. ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు ఆయన పాదయాత్ర కూడా చేశారు. సినిమా కోసం ఎంతైనా కష్టపడతానని.. అంతకుముందు వచ్చిన ‘లక్ష్య’ చిత్రంతోనే శౌర్య నిరూపించాడు. ఇప్పుడు పాదయాత్రతో మరోసారి తను వార్తలలో ఉండటమే కాకుండా.. సినిమా గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశాడు. టైటిల్ కూడా వైవిధ్యభరితంగా ఉండటం, ఈ ప్రమోషన్.. మొత్తం వెరసీ.. ఈ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడ్డాయో? అ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని అందుకుందో.. రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కృష్ణాచారి (నాగశౌర్య).. ఉద్యోగం నిమిత్తం.. తను ఉన్న పల్లెటూరి నుండి హైదరాబాద్ వస్తాడు. కృష్ణాచారి తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్) మాటంటే ఆ పల్లెటూరిలోని వారంతా హడలిపోవాల్సిందే. కట్టుబాట్లకు విలువిచ్చే మనిషి. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కృష్ణాచారి అక్కడ టీమ్ లీడర్‌గా ఉన్న వ్రింద (షెర్లీ)తో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటాడు.

కానీ కట్టుబాట్లకు విలువచ్చే అమృతవల్లి.. ఆ మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే.. ఒప్పుకోదని తెలిసి.. ఆమె దగ్గర ఓ అబద్ధమాడి.. చివరికి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. వ్రిందకి కూడా ఓ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి? కృష్ణాచారి చెప్పిన అబద్ధం ఏంటి?.. సాంప్రదాయాలకు విలువిచ్చే అమృతవల్లికి, మోడ్రన్ గాళ్ అయిన వ్రింద మధ్య.. ఎటువంటి వాతావరణం నడిచింది. ఆ ఇద్దరితో వచ్చిన సమస్యలకు కృష్ణాచారి ఏం పరిష్కారం కనుగొన్నాడు అనేదే ఈ సినిమా కథ.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
నాగశౌర్య ఇందులో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించాడు. రెండు పాత్రలకు ఆయన న్యాయం చేశాడు. ముఖ్యంగా బ్రాహ్మణ యువకుడిగా ఆయన అభినయం ఆకట్టుకుంటోంది. చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ట్రెండీగా కనిపించే పాత్ర ఆయనకు కొత్తేం కాదు. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలన్నీ దాదాపు అలాంటివే. షెర్లీ సేథియా కూడా ఫస్ట్ సినిమాలా కాకుండా కాస్త పేరున్న నటిలానే అభినయంతో ఆకట్టుకుంది.

అమృతవల్లి పాత్రలో రాధికనే ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఆ పాత్రకే నిండుతనాన్ని తెచ్చిందామే. కోడలితో గొడవపడే సందర్భంలోనూ రాధిన నటనతో మెప్పించింది. ఇంకా కమెడియన్స్ బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి వారు సీట్లో కూర్చున్న ప్రేక్షకుల్ని కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తారు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా.. వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. కెమెరా వర్క్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకోవాలి. ప్రతీ సన్నివేశం కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే నిర్మాణ విలువలు కూడా హైలెట్‌గా ఉన్నాయి. నాగశౌర్య సొంత బ్యానర్ కావడంతో.. నిర్మాణం విషయంలో ఎక్కడా తగ్గలేదు. అది ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. మహతి స్వర సాగర్ ఇచ్చిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు.

ఆ కథని ఎలా అయితే చూపించవచ్చో.. అలాగే ఎడిటర్ తన పని తాను చేసుకుపోయాడు. అయితే ఇక్కడ దర్శకుడి తప్పిదే మెయిన్ హైలెట్ అవుతుంది. సినిమా చూస్తున్నంత సేపూ.. ఇందులో దర్శకుడు తీసుకున్న పాయింట్‌తో 3 నెలల క్రితమే ఒక సినిమా వచ్చి ఉండటం పెద్ద మైనస్‌‌గా మారడంతో.. సినిమా కోసం ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టినా.. అది బూడిదలో పోసిన పన్నీరు అనే చందంగానే మారిపోయింది.

విశ్లేషణ:
ఈ సినిమా చూస్తున్నంత సేపూ గుర్తొచ్చే సినిమా ‘అంటే సుందరానికీ’. సేమ్ కాన్సెఫ్ట్, సేమ్ అబద్ధాలు. అందుకే దర్శకుడు ఈజీగా దొరికేశాడు. ‘అంటే సుందరానికీ’ సినిమా విడుదలైన తర్వాత.. ఈ సినిమా కథ విషయంలో మార్పులు చేయడానికి సరిపడా టైమ్ దొరకలేదో, లేదంటే అప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తయిందో తెలియదు కానీ.. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రతీ సీన్‌లోనూ ఆ సినిమానే గుర్తొస్తూ ఉంటుంది. కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని హాస్యపు సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తాయి.

అయితే ఆ హాస్యపు సన్నివేశాలపై పెట్టిన దృష్టిని.. నటీనటుల నుండి ఎమోషన్స్ రాబట్టడంలో దర్శకుడు పెట్టలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి అందని విధంగా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా అనిపిస్తాయి. మొత్తంగా.. ప్రేమించుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ.. పెళ్లి తర్వాతే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పడమే ఈ సినిమాలోని మెయిన్ కథాంశం. అయితే.. ఇప్పుడున్న ప్రేక్షకులని అర్థం చేసుకోవడం ఎవరితరం కావడం లేదు.

వారికి సాదా సీదా కంటెంట్ అస్సలు ఎక్కడం లేదు. పాత్రలకు సరిపడా నటులను ఎంపిక చేసుకున్నా.. కామెడీతో మెప్పించాలని ప్రయత్నించినా.. మూడు నెలలకు ముందు వచ్చిన సినిమా కంటెంట్‌తోనే మళ్లీ సినిమా వస్తే.. ప్రేక్షకులు పట్టించుకుంటారా?. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘కృష్ణ వ్రింద విహారి’ అని కాకుండా.. ‘అంటే.. కృష్ణాచారికీ’ అని టైటిల్ పెడితే సరిపోయేది. కాకపోతే ఈ సినిమాలో కొన్ని పాత్రలు మారాయి అంతే.

ట్యాగ్‌లైన్: ‘అంటే.. కృష్ణాచారికీ’
రేటింగ్: 2.5/5

Updated On 23 Sep 2022 4:28 PM GMT
somu

somu

Next Story