Love Marriage | ఓ ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పంచి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ముహుర్త సమయానికి వరుడు పరారీ అయ్యాడు. వరుడు పారిపోతున్నట్లు గ్రహించిన వధువు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీకి చెందిన ఓ యువతి, యువకుడు గత రెండున్నరేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మనసులు కలియడంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఈ నేపథ్యంలో బరేలీలోని ఓ ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు.
వధువు ఆలయం వద్దకు చేరుకుని ముస్తాబైంది. ముహుర్త సమయం రానే వచ్చింది. కానీ వరుడు మాత్రం రావడం లేదు. దీంతో వధువు వరుడికి ఫోన్ చేయగా, తన తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే పెళ్లి నుంచి తప్పించుకునేందుకు వరుడు యత్నిస్తున్నట్లు వధువు గ్రహించింది.
దీంతో తన కుటుంబ సభ్యుల సహాయంతో వధువు వరుడిని 20 కిలోమీటర్ల మేర వెంబడించి పట్టుకుంది. భీమెరా పోలీసు స్టేషన్ వద్ద వరుడు బస్సు ఎక్కుతుండగా అతన్ని పట్టుకుంది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వరుడిని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించారు.